భగవంతం కోసం

محمد مخزنجي

Photograph by Laura Blight

నాలుగూ నలభై ఆరు. ఇక్కడే ఉండమన్నాడు. నలభై ఆరు నిమిషాలయిపోయింది నియమితకాలం దాటి. భగవంతం యింకా రాలేదు. వస్తాడా ఈ రోజు? అసలు ఎప్పుడేనా వస్తాడా?

సిగరెట్ వెలిగించాను. నల్లగా మాడుతూ మండుతూంది వర్జీనియా. ఏడో నంబర్ బస్ బాగా బలిసిన ఊరకుక్కలాగ దూరం నుంచి వస్తుంది. స్టాప్ దగ్గర ఆగి ఒక డజను మందిని పోసింది—సాధారణంగా చెట్టు కనిపిస్తే చేసేపని—మళ్ళీ ముందుకు పోయింది. భగవంతం లేడు ఆ గ్రూప్ లో.

లెప్పర్ గేంగ్ ఒకటి పాటలు పాడుతూ అడ్డంగా పోతుంది. చేపలని పట్టే వలలాగ. కాని లాభంలేదు. “చిల్లర డబ్బుల్లేవు.”

తరువాత బస్లో వస్తాడా? పదమూడో నంబర్లో.

అట్నుంచి వస్తాడా?

ఎదురుగా, రూపం పొందిన న్యూమోనియాలాంటి యిల్లు. తడిగా ఊపిరితిత్తుల్ని డెస్పెరేట్గా సూర్యరశ్మిలోకి పైకి లాగి ఎండవేద్దామన్నా ఊహతో దగ్గుతున్నట్లు. గోడల మీద సర్రియలిస్ట్ తడి మచ్చలు, చారలు. గోడ వెనక గాలిలో నీళ్ళని దులుపుకుంటూ పచ్చగా ఆకాశకిరణంలా- అరటిచెట్టు, ధైర్యంగా, అమాయకంగా, పిచ్చిది.

భగవంతం చెప్పకుండా వస్తాడు. ముందు చెప్పినా ఎట్నుంచి వస్తాడో తెలీదు. ఎట్నుంచి వస్తాడో తెలిసినా, అనుకున్న టైమ్ కి రాడు. వచ్చినా అతనితో ఏమిటి మాట్లాడ్డం?

రోడ్ మీద పొట్టిగా, నల్లగా అంతర్ముఖాలతో పీత నడక ఆలోచనలతో ఖైదీల్లాగ. దూరంగా మూగ సముద్రం అర్ధంలేని ఘోష పెట్తోంది. సగం కాల్చి పారేసిన పీకల మీద వర్షం పడి, మెత్తగా, ముద్దుగా బైల్ రంగులో . . .

లేంప్ పోస్ట్ కి ఆనుకొని కోట్ పాకెట్ లోంచి పాత ఉత్తరం తీసేను. పదిహేనేళ్ళ క్రితం భగవంతం రాసిన ఉత్తరాం. తుప్పురంగు . . . “నీ భయాలూ, అనుమానాలూ నాకు తెలుసు. భరించలేననుకుంటే, పరిగెత్తుకురా, వాళ్ళని వదిలేసి. నా యింటి ద్వారం ఎప్పుడూ తెరుచుకునే ఉంటుంది . . . ”

పాపం! లోకం మార్పులకి దూరంగా వుండి పాతబడి పోయాడు భగవంతం.

ఈ హోటల్లోకి వెళ్ళి కూర్చుని నిరీక్షిస్తాను. కిటికీలోంచి రోడ్ కనిపిస్తుంది. ఎట్నుంచి వస్తాడో?

హోటల్ చూడండి. దీన్ని చూస్తే నాకు రోత. దీని మేనేజర్ని చూస్తే అసహ్యం. దీనిలోని వెయిటర్స్ ని చూస్తే భయం, అనుమానం. గాజు పెంకులు రుద్ది నట్లుంటుంది మేనేజర్ ముఖం. దాన్ని చూస్తే అసహ్యం.

ఇందులోకి వచ్చి, వీడు చేయించి పెట్టే చెత్తని మెక్కి మెల్లగా కప్పల్ని తిన్న పాముల్లా పైకి పోయే జనాన్ని చూస్తే అసహ్యాం.

ఈ పుట్టే అసహ్యం అంటే నాకు ఎంతో యిష్టం, ప్రేమ. ఈ అసహ్యం తెరలు తెరలుగా వస్తంటే మూడో పెగ్ జిన్ తో వచ్చే నెర్వస్ ఎనర్జీ దేహంలో వ్యాపిస్తున్నట్టుటుంది. ఇక్కడ యీ మూల టేబుల్ దగ్గర కూర్చుంటాను. కిటికీలోంచి రోడ్ మీద ట్రాఫిక్ కనిపిస్తుంది. లోపల యీ పురుగులు మాట్లాడే మాటలు వినిపిస్తాయి.

భగవంతం పేరులోనే ఉంది సనాతనత్వం. పాత ఫక్కీ, పిలకలు, కిర్రు చెప్పులు, చెవులకి కుండలాలూ, ఆరవేసినా అంగవస్త్రాలు వినిపిస్తాయి, కనిపిస్తాయి యీపేర్లో. నేను అతని కోసం యీ హోటల్లో కూర్చుని నిరీక్షించడం—ఒక పెద్ద పేరడాక్స్.

“మనకి యిండిపెండెన్సేమిటి, మనం శుద్ధ వెధవలం. మనకి కేరక్టరొకటా. వుత్త ఫకీరు జాతి మనది . . . ”

“మనిషి గుండులా గుంటాడు. ఆసనాలు వేస్తాడు. కాని బ్రహ్మ కాన్ స్టిపేషన్ . . . ”

“నా డెస్టినీ లైన్ లో అన్నీ బ్రేక్స్ . . . ”

“నయాపైసా అప్పు పుట్ట . . . ”

“పని చేస్తూ ఆవలింతలూ. ఏం ఉద్యోగమో . . . ”

“మా బుజ్జిగాడికి గొంగళి పురుగులు కనిపిస్తే చాలు, చేత్తోనే అలా నలిపే . . . ”

“మిడ్ ఫీల్డ్ లో రిఫరీని పట్టుకు తన్నారట . . . ”

“చూచుకోలేదుట. గన్ క్లీన్ చేస్తుంటే తూటా గుండెలోంచి . . . ”

“మా వాడి ముణుకు ఎందుకు విరిగిందో ధనాధిపతి దశ కూడానూ . . . ”

“పిచ్చెత్తిందట. కత్తి పీటతో పెళ్ళాన్ని, పిల్లల్ని నరికి . . . ”

“నా ప్రమోషనెందుకు ఆగిపోయిందో శనిగాడు కాబోలు . . . ”

కాఫీ తెచ్చాడు వెయిటర్. కాఫీ! ఇది కాఫీ కాదు. వుత్త గోధుమ రంగు వేడి. తిడదామనుకున్న తిట్లు తలచుట్టూ యీగల్లాగ మూగాయి.

“నీ పేరేమిటి” అన్నాను, తెగించి. ఏదో మహా రహస్యం తెలుసుకోబోతున్నట్లు ముఖం పెట్టి.

“ఉన్నిథన్."

 ఉన్నిథన్, ఉన్నిథన్! కొబ్బరి తోటలు. మెల్లగా బేక్ వాటర్స్ లో బరువుగా పోయే పడవాలు . . . వెళ్ళివోడం . . . నల్లటి వంకల జుత్తుల మెరుపులు. లవంగాలు, ఏలుకలు, కోప్రా . . . సుగంధం!

“పో” అన్నాను.

“ఆఁ?” అన్నాడు.

“ఇవాళ ఏదో తేలిపోవాలి. నేనో, అతనో. దీనికర్థం లేదు. లోపలికి పోయి ఆలోచించు. ఈ కాఫీకి ఎంత అర్థంలేదో ఉన్నిథన్ ఉనికికీ అంతే అర్థంలేదు. జై ఫటాఫట్.”

ఉన్నిథన్ మోకాళ్ళ దాకా మడిచిన లుంగీని మళ్ళీ సర్దుకుంటూ, భారతదేశం లోని వింతలూ విశేషాలూ అన్నీ చూసేశాననుకున్న తన తెలివితక్కువ తనాన్ని మళయాళంలో తిట్టుకుంటూ వెనక్కి తిరిగి పోయాడు.

. . . భగవంతం రాలేదు. బస్సులో రాలేదు. రిక్షామీద రాడు. నడవడూ . . . 

“ఫిట్లు కాబోలు. రెండు బాల్చీలు పొయ్యండి. నురగలు కక్కేస్తున్నాడు.” రోడ్డు మీద మూగిన జనం. తమాషా. కానీఖర్చు లేకుండా చూడొచ్చు. ఏదో మజా, కాలక్షేపం. ఒళ్ళు జలదరిస్తుంది. దేవుడు మేలు చేసాడు. కాని, లేకపోతే మనమూ అలాగే. అమ్మో! అదో థ్రిల్.

ఉక్క. చమట. పురుగులు.

అప్పుడప్పుడు ఉప్పగా గాలి.

జిడ్డు.

వేడి.

పైని అలసిన సాయంకాలపు ఆకాశంలో ఎర్రగా కిల్లీ ఉమ్ముతూ సాగిపోతున్నాడు—సూర్య భగవాన్.

కాలు మడిచి గోడను ఆనుకుని గోళ్ళల్లోని పైకి లాగుతున్నాడు. ఉన్నిథన్. ప్రేమగా పిలిచేను, “ఉన్ని.”

జడుస్తూ వచ్చాడు. ఇంకో కప్పు కాఫీ తెమ్మన్నాను. బ్రతిమాలుతున్న స్వరంలో. కలలో అసందర్భంగాకనిపించి, కరిగిపోతిన ఏదో తునకలాగ వెళ్ళిపోయాడు హోటల్ వెనుక రౌరవంలోకి.

భగవంతం కోసం ఎంత కాలం ఈ యాతన, ఈ నిరీక్షణ? ఎన్ని గంటలు? ఎన్నేళ్ళు?

“ఈ మనఃఫలకాన్ని, కాన్షస్నెస్ని పరిశుద్ధం చేసి . . . ” అని అనుకుంటుంటే లోపలి లోపలి లోతుల్లోంచి నవ్వు ఉప్పెనగా వచ్చి, ఎడమచేయ్యి రిస్ట్ మీద గట్టిగా గిల్లుకున్నాను. సైన్ అది. ‘డ్రామాలు మాని వేషాలు తీసేసి—ఆలోచించు’ అని వార్నింగ్ సైన్.

రౌరవంలోని మెఫిస్టోఫిలిస్ లాగ వస్తున్నాడు. పొగలు కక్కుతున్న కాఫీ పట్టుకుని, దగ్గరగా వచ్చి, టేబుల్ మీద కాఫీ కప్పు పెట్టి, బెదురుతూ తిరిగి పోబోయే ఉన్నిథన్ కళ్ళల్లోకి చూస్తూ, కళ్ళతో బలవంతంగా ఆపి, “నువ్వులేవు. నువ్వు ఉత్తమాయ. నీకు ఉనికి లేదు. హ్యూమ్ చదివేవా? లాక్ ఏమన్నాడో తెలుసా? కాంట్! కిర్క్ గార్డ్? నువ్వు వున్నావని నే ననుకుంటూ, నీతో మాట్లాడుతున్నానని నువ్వు అనుకుంటే, అలా అనుకుంటున్నావని నేననుకుం—” 

ఉన్నిథన్ లుంగీ దక్షిణపు గాలిలో ఎగిరే తెరచాపలాగ . . .  “అయ్యో!”

కుడికన్ను ఇరగా పెట్టి ముక్కు అంచుమీంచి చూపే న్యూమోనియా ఇంటి ఎడమ చివర కిటికీ మూడో ఊచనించి గీత మొదలుపెట్టి రోడ్ మీంచి కోసుకుంటూ వచ్చి మేనేజర్ బట్టతలని రాసుకుంటూ యీ టేబుల్ మీద ఉన్నిథన్ పెట్టి వెళ్ళిపోయిన కప్ లో మెరిసే పొంగులో మిళితం అయిపోతుంది.

టేబుల్ మీద కాఫీ! కాఫీ! ఇది కాఫీ కాదు. ఉత్త వేడిగా ఉన్న గోధుమ రంగు.

పదమూడో నంబరు వచ్చి ఆగింది. ఆగి ఒక మార్కోవిచ్ ముఖాన్ని, యూలినెస్ లాగ వెడల్పుగా వున్న ముఖాన్నీ, ఒక టెరిలిన్ కవచాన్నీ, ఒక స్టెతస్కోప్ నీ, ఒక అజ్ఞాతంలో వున్న అర్జునుణ్ణీ దింపింది. భగవంతం లేడు. అట్నుంచి ఏదో నంబర్లో వస్తాడా?

ఉన్ని మేనేజర్ చెవిలో చెపుతున్నాడేదో—మేనేజర్ వెనక్కి తిప్పేడు ముఖాన్ని—గాజు పెంకులు రుద్దిన ముఖం. బరువైన కళ్ళ రెప్పలక్రింద రెండు బలిసిన కుక్కలు—రోడ్ మీద అడ్డంగా, బద్ధకంగా, ఆవులిస్తూ పడుకొన్న రెండు పోతుల్లాంటి కుక్కాలు—మెల్లగా గఱ్ఱుమంటున్నాయి. కళ్ళు మూస్తే పెద్ద గబ్బిలాల రెక్కలు. కుక్కల్ని నావైపు ఉసిగొల్పేడు.

అదే క్షణం. ఇదే గొప్ప రివెలేషన్. చుట్టూ మెరుపులో విచ్చుకత్తుల్లా తళతళమని ఎవరో దూస్తూ ఉంటే, ఉరుములు రాక్షసరథాల్లా ఉరుకులు పెడ్తుంటే, దర్శనమిచ్చిన దయాళువు వరాలు కోరుకోమంటుంటే . . . ప్రపంచపు అరటిపండుని ఎవరో వొలిచి చేతులో పెట్తూ ఉంటే . . . 

క్షణమాత్రపు రివెలేషన్, కుక్కల్ని గబ్బిలాల రెక్కలతో మూసేశాడు మేనేజర్.

ఇంక జాగుచేస్తే లాభం లేదు, ముప్పు. లేచి మేళ్ళేను కౌంటర్ దగ్గరకి.

“ఇదిగో ముందే యిచ్చేస్తున్నాను, నాలుగు కప్పల కాఫీకి డబ్బు,  ఏం భయం లేదు. మెంటల్ హాస్పిటల్ కి ఫోన్ చెయ్యండి కావలిస్తే. ఎవరూ అక్కణ్ణుంచి తప్పిపోయి రాలేదు. అంతా భద్రంగా ఉంది అక్కడ. ఉన్నిథన్ నా లాంగ్ లాస్ట ఫ్రండ్. మీ కళ్ళల్లో పెంచుతున్నవి అల్సేషన్లా, డేల్మేషన్లా, డేక్ షుండ్లా?”

తిరిగి వచ్చేశాను టేబుల్ దగ్గరికి. జవాబెందుకు నాకు?

నిటారుగా, నీటుగా నిలబడ్డ కొబ్బరిచెట్ల బారులో తిక్కగా, సినికల్ గా, పంక్ష్యుయేషన్ మార్కులన్నీ ఒకేచోట జలిమిలి అయిపోయినట్లు, ఎనిమిది వంకర్లతో పెరిగే యింట్రోవర్ట్ కొబ్బరి చేట్టులా నిలబడుతున్నాడు ఉన్నిథన్ గోడనానుకుని.

“సెమికోలన్, ఎక్లమేషన్ మార్కులు విడదీసి, ఇక్కడకు వస్తావా ఉన్నీ?”

వచ్చాడు. “మూడో కప్ తీసుకురా, ప్లీజ్.”

ఒక్కొక్క మార్కు అలా నేలమీద జల్లుతూ వెళ్ళేడు లోపలికి హేమింగ్వే వాక్యంలాగ. నీట్ గా, బ్రిస్క్ గా, ఓవర్టోన్స్ ఏమీ లేకుండా.

భగవంతం వస్తుంటే ఏక్సిడెంటేదేనా అయి ఎముకలేవేనా విరిగి . . .

పసితనపు నూనూగుకి, పెద్దతనపు గడుసుతనం చలాకీకి మధ్య తటపటా యిస్తున్న నలుగురి స్టూడెంట్ల గేంగ్ వచ్చింది లోపలికి తుళ్ళుకుంటూ.

టేబుల్ చుట్టూ చదరంగా వుంచిన కుర్చీలన్నీ రకరకాల కోణాల్లోకి తిప్పి, జారబడుతూ కాళ్ళు మెలికలుగా తిప్పుతూ, జాపుతూ కూర్చున్నారు.

ఉన్నిథనగ మూడో కాఫీ తెచ్చాడు. కాఫీ? అది కాఫీ కాదు. ఉత్త వేడిరంగు గోధుమ ఊహ.

“బెంజి గాడేమిటి చెప్పాడురా ఇవాళ?”

“సరస్వతిలో టోనీ కర్టిస్. ఎలిజబెత్ టేలర్ . . . ”

“సుజాత అలాగ పతివ్రతలాగ క్లాసులో కూర్చుంటుందిగాని ఇద్దరు లవర్సురా బాబూ . . . ”

“ఉత్త డుస్కీ మాటలాడకోయ్ . . . ”

భగవంతం రాడు గాబోలు. పది లెఖ్ఖబెట్టి లేచాను. పైకి వెళ్తూ యీ పైమాటల దగ్గర ఆగి అన్నాను విషాద స్వరంలో: అన్నీ కలిపేయండి. ఒకదానికొకటి గొలుసు లాగ కలిపి ఆలోచించండి. అర్థమయిపోతుంది. ఆ తరువాత అంతా సులభమే.

కౌంటర్ దగ్గర చేరి, “మూడే తాగేను. నాలుక్కిచ్చేను. అదే లోక న్యాయం. మిగతాతి పర్గటోరియోలో మనమిద్దరం కలుసుకున్నప్పుడు యిద్దురుగాని. టైం లేదు. ఉన్నిథన్కి కూడా చెప్పండి. బై బై” అని పైకి వచ్చేసాను.

ఆకాశంలో నక్షత్రపు జల్లు. భగవంతం రాడు. అట్నుంచి ఏడో నుంబర్లోను రాడు, ఇట్నుంచి పదమూడో నంబర్లోనూ రాడు . . . నా పిచ్చిగాని.